: రూపాయి చలవతో దిగిరానున్న ధరలు?
కొన్ని నెలల క్రితం డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68.83. మరిప్పుడు అది 58.75కు బలపడింది. రూపాయి బలపడడం వల్ల రానున్న రోజుల్లో లగ్జరీ కార్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, వినియోగదారుల వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. అలాగే, దిగుమతి ఆధారిత వస్తువుల ధరలు కూడా తగ్గనున్నాయి. అయితే, రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయి కోలుకున్నందున ఇప్పటికిప్పుడు ధరలు తగ్గించే ఉద్దేశంలో కంపెనీలు లేవు. రూపాయి గమనాన్ని పరిశీలిస్తున్నామని, మరో రెండు మూడు నెలలపాటు వేచి చూసి, రూపాయి ఇలానే బలం పుంజుకుంటే ఆ మేరకు వినియోగదారులకు ప్రయోజనాలను బదిలీ చేస్తామని సోనీ ఇండియా అమ్మకాల విభాగం హెడ్ సునీల్ నాయర్ తెలిపారు. రూపాయి బలపడడం ఇలానే కొనసాగితే మార్కెట్లో అమ్మకాలు పుంజుకుంటాయని ఎల్జీ ఇండియా మార్కెటింగ్ హెడ్ సంజయ్ అభిప్రాయపడ్డారు.