: గుజరాత్ సీఎం పదవికి నేడు నరేంద్రమోడీ రాజీనామా
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి దేశ ప్రధానమంత్రిగా ఈ నెల 26న ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్రమోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి ఈ రోజు రాజీనామా చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా సమర్పించడానికి ముందు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరవుతారు. సభ్యులంతా ఆయనకు వీడ్కోలు పలికిన అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు మోడీ తన రాజీనామాను సమర్పిస్తారు. ఆ తర్వాత జరిగే పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో మోడీ వారసుడిని ఎంపిక చేస్తారు. దీనికిగాను పార్టీ సీనియర్ నేత తవర్ చంద్ గెహ్లాట్ ను పరిశీలకునిగా బీజేపీ నియమించింది. నూతనంగా ఎన్నికైన శాసనసభాపక్ష నేతతో కలసి గవర్నర్ తో భేటీ అయిన అనంతరం స్పీకర్ ను కలసి మోడీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తారు. నరేంద్ర మోడీ 2001 అక్టోబరు 7వ తేదీ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాగా రేపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఆయన హాజరుకానున్నట్టు సమాచారం.