: ప్రతిపక్ష నేతగా కమల్ నాథ్ కు అవకాశం?
44 లోక్ సభ స్థానాలతో కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందున ప్రతిపక్ష నేతగా కమల్ నాథ్ ఎంపికయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నిజానికి పార్లమెంటులోని మొత్తం సీట్లలో కనీసం 10 శాతం సీట్లు సాధించుకున్న పార్టీకే ప్రతిపక్షంగా గుర్తింపునకు అర్హత ఉంటుంది. 545 స్థానాలకు గాను 54 స్థానాలైనా పొంది ఉండాలి. కానీ కాంగ్రెస్ 44 స్థానాలే గెలుచుకోగలిగింది. అయితే, స్పీకర్ కున్న అధికారం మేరకు కాంగ్రెస్ ను ప్రతిపక్షంగా గుర్తించవచ్చు. అయితే, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టడానికి సోనియాగాంధీకానీ, ఆమె తనయుడు రాహుల్ గానీ ఆసక్తిగా లేరని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ వారం చివర్లో జరిగే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియాగాంధీ కమల్ నాథ్ పేరును ప్రతిపాదించనున్నారంటూ సమాచారం వినిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ గా మరోసారి సోనియానే సభ్యులు ఎన్నుకోనున్నారు.