: తొలిసారిగా ఓ మహిళకు గుజరాత్ సీఎం పీఠం
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ స్థానంలో 73 ఏళ్ల ఆనంది బెన్ పటేల్ బాధ్యతలు చేపట్టడం ఖాయమైనట్లు సమాచారం. ఆనంది బెన్ పటేల్ ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో రెవెన్యూ, పట్టణాభివృద్ధి, రహదారులు, భవనాల శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. మోడీ గుజరాత్ లో లేనప్పుడు పాలనా బాధ్యతలు ఆమే చూస్తుంటారు.
1980లలో ఆనంది ప్రభుత్వ టీచర్ గా పనిచేసేవారు. 1987లో స్కూల్ విద్యార్థులతో కలసి పిక్ నిక్ కు వెళ్లిన సందర్భంలో ఓ ఇద్దరు ప్రమాదవశాత్తూ సర్దార్ సరోవర్ డ్యామ్ లో మునిగిపోయారు. ఆ సమయంలో ఆనంది డ్యామ్ లోకి జంప్ చేసి ఇద్దరు విద్యార్థులను రక్షించారు. అప్పుడు ఆ ఘటన గుజరాత్ అంతటా సంచలనం సృష్టించింది. ఈ సాహసోపేత చర్యకు గాను గవర్నర్ నుంచి గ్యాలెంటరీ అవార్డును అందుకున్నారు. ఆనంది భర్త మఫత్ భాయ్(77) సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు.
ఆనంది, మోడీ ఒకే స్కూల్ విద్యార్థులు. మెహ్ సానాలోని ఎన్ఎం హైస్కూల్ లో వీరు చదువుకున్నారు. ఆనందికి 46 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమెను బీజేపీలో చేరాలని మోడీ అనుచరులు కోరారు. భర్త ప్రోత్సాహంతో ఆమె అందుకు అంగీకరించారు. మోడీ గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఆనంది పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలయ్యారు. 1994లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1998 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. కేశూభాయ్ మంత్రివర్గంలో, తర్వాత మోడీ మంత్రివర్గంలో కీలక భాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోడీకి ఎంతో నమ్మకస్తులు. 15ఏళ్లుగా భర్తతో విడిపోయి ఉంటున్నారు.