: సోనియా, రాహుల్ గాంధీకి కనీస మర్యాద కూడా తెలవదా?: వెంకయ్య నాయుడు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కనీస మర్యాద కూడా తెలియదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీకి అభినందనలు తెలియచేయాలన్న కనీస మర్యాదను వారు పాటించలేదన్నారు.
"నరేంద్ర మోడీని మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకకు చెందిన దేశాధినేతలు సహా అమెరికా అధ్యక్షుడు, బ్రిటిష్ ప్రధాని... ఇలా అనేక దేశాలకు చెందిన ప్రధానమంత్రులు అభినందించారు. కానీ, కాబోయే ప్రధానమంత్రిని అభినందించాలన్న కనీస మర్యాద కాని, భారతీయ మౌలిక సంస్కృతి కాని సోనియా, రాహుల్ గాంధీకి లేవు" అని ఇవాళ హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో వెంకయ్య విమర్శించారు. చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం, అవినీతి, దుష్పరిపాలన, విధానాల వైఫల్యం వంటి కారణాలతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని శిక్షించారని ఆయన అన్నారు.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం నాడు సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకుంటుందని ఆయన చెప్పారు. దీని గురించి పార్టీ అధ్యక్షుడు చెబుతారని, ఈ దశలో తాను దీనిపై మాట్లాడితే బాగుండదని ఆయన అన్నారు.