: రేపు కుటుంబ సమేతంగా తిరుమలేశుణ్ణి దర్శించుకోనున్న బాబు
కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనార్థం టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం తిరుమలకు వెళుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం విమానంలో తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.
చంద్రబాబుకు టీటీడీ తరపున సంప్రదాయ మర్యాదలు అందాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థికి తిరుమల ఆలయ మర్యాదలు చేయడం ఆనవాయతీ. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఈవో గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితరులు హైదరాబాదుకు చేరుకుని చంద్రబాబును కలిశారు. అర్చకులు ఆశీర్వాదం పలుకగా, ఈవో గోపాల్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.