: పీజేఆర్ కుటుంబం నుంచి పోటీ చేసిన ఆ ఇద్దరూ ఓడిపోయారు!
ఖైరతాబాదులో తిరుగులేని నేతగా ఎదిగిన దివంగత పబ్బతిరెడ్డి జనార్థన్ రెడ్డి (పీజేఆర్) కుటుంబం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరూ పరాజయాన్ని చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత ముందు పీజేఆర్ చరిష్మా కూడా పనిచేయలేదు! జననేతగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బస్తీల్లో మంచి పట్టును సంపాదించుకున్న పీజేఆర్ కు వాడవాడలా విగ్రహాలు పెట్టి నియోజకవర్గ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పీజేఆర్ ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి పరాజయం పాలయ్యారు. ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో తొలిసారిగా బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ఆయన మాజీ మంత్రి దానం నాగేందర్ ను సైతం మట్టి కరిపించారు. ఇక, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేసిన పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమిని చవిచూశారు. 2007 డిసెంబర్ లో పీజేఆర్ హఠాన్మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి విష్ణువర్థన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
2009 ఎన్నికలకు ముందు జరిగిన నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణలో ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని విడదీశారు. దాని నుంచి విడిపోయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రెండో సారి విజయం సాధించారు. ఈసారి ఆయనకు హ్యాట్రిక్ విజయం ‘చే’జారిపోయింది.