: మోడీ వెనుక దేశమంతా బ్యాలెట్ రూపంలో నిలిచింది: శివసేన
దేశంలో 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని, నరేంద్ర మోడీలాంటి బలమైన నాయకుడి వల్లే ఇది సాధ్యమైందని ఎన్డీయే భాగస్వామ్యపక్షం శివసేన చెప్పింది. ఈ ఎన్నికల ఫలితాలతో భారతీయులు పూజిస్తున్న ముక్కోటి దేవతలు ఏకమై దేశప్రజలను దీవించినట్లు అయ్యిందని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో ఆ పార్టీ పేర్కొంది. 1977లో ఏర్పాటైన జనతా పార్టీ ప్రభుత్వం సాధించిన విజయం కంటే ఇది పెద్దదని శివసేన తెలిపింది.
నరేంద్ర మోడీ వెనుక దేశమంతా బ్యాలెట్ రూపంలో వెంట నిలిచిందన్నారు. నమో ధాటికి మహావృక్షాలు కూకటి వేళ్లతో పెకలించుకుపోయాయని, దాంతో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రస్తుతానికిది మన్మోహన్ సర్కారు ఓటమే అయినా, గాంధీ కుటుంబానికి అతి పెద్ద నష్టమని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు.