: సీమాంధ్రను పునాదుల నుంచి అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు
సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని టీడీపీ అధినేత, సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా సీమాంధ్రను పునాదుల నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన క్రమంలో ఈ ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు బాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ ఆశీర్వాదాలు తీసుకునేందుకు వచ్చామని తెలిపారు.
ఎన్టీఆర్ వద్ద అనేక విషయాలు నేర్చుకున్నానని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన వ్యక్తి ఆయనేనని పేర్కొన్నారు. తెలంగాణను నవ తెలంగాణగా మార్చాల్సిన బాధ్యత తమపై ఉందని బాబు అన్నారు. టీడీపీపై చాలా కుట్రలు పన్నారని, అయినా వారే దెబ్బ తిన్నారని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.