: ఎన్ని కుట్రలు చేసినా మా గెలుపును అడ్డుకోలేకపోయారు: చంద్రబాబు
అవినీతి, కుట్ర రాజకీయాలపై రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాదులో ఇవాళ చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... ఎన్ని కుట్రలు చేసినా, ప్రలోభాలు పెట్టినా తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేకపోయారని అన్నారు. దేశ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఆయన చెప్పారు. మోడీ గెలుపును ముందే ఊహించామని, మోడీ వేవ్ గా వచ్చిందని ఇప్పుడు అర్థమైందని ఆయన అన్నారు. తెలంగాణ తెచ్చామన్న కాంగ్రెస్ కంటే టీడీపీ, బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. తమపై వచ్చిన అపవాదులను ప్రజలు నమ్మలేదని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ అవినీతి వల్లే దేశం భ్రష్టు పట్టిందని బాబు అన్నారు. అవినీతిని అడ్డుకోవడం, అభివృద్ధిని లైన్ లోకి తేవడం తమ తక్షణ కర్తవ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని, సీమాంధ్రను స్వర్ణాంధ్రను చేసే బాధ్యత తనదేనని పునరుద్ఘాటించారు. కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో సుస్థిరమైన ప్రభుత్వం వస్తోందన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీల్చకూడదనే పవన్ కల్యాణ్ పోటీ నుంచి విరమించుకుని తమకు మద్దతు పలికాడని ఆయన అన్నారు.