: పోకిరీగాళ్ళను ఓ 'పట్టు' పట్టిన కబడ్డీ క్రీడాకారిణి
ముంబయిలో ఈవ్ టీజర్ల పాలిట ఓ కబడ్డీ క్రీడాకారిణి అపర కాళికే అయింది. హర్షల మోరే అనే కబడ్డీ క్రీడాకారిణి ప్రాక్టీసు ముగించుకుని సహచరులతో కలిసి వస్తుండగా.. ఇక్కడి సాటిస్ స్కైవాక్ వద్ద ఇద్దరు ఆకతాయిలు ఆమెను ఉద్ధేశించి అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు. మామూలు అమ్మాయిల్లా తలదించుకుని, కంటనీరు పెట్టుకోలేదీ ధైర్యశాలి.
అది రాత్రి వేళ అయినా ఆమె వెనుకంజ వేయలేదు. వారి వ్యాఖ్యలతో ఉగ్రరూపం దాల్చిన ఆ క్రీడాకారిణి వారిద్దిరిలో ఒకడిని వెంటాడి పట్టుకుని థాణే పోలీసు స్టేషన్లో అప్పగించింది. మరో వ్యక్తి పరారయ్యాడు. కాగా, ఆ ఇద్దరు ఆకతాయిల పేర్లు రమేశ్ థోరట్ (24), ప్రితేష్ ఘారట్ (26) అని పోలీసులు వెల్లడించారు.
సంఘటన స్థలంలోనే రమేశ్ పట్టుబడగా.. పరారైన ప్రితేష్ ఆ తర్వాత అరెస్టయ్యాడు. దేశంలో మహిళలపై అరాచకాలు పెచ్చుమీరి పోతున్న తరుణంలోనూ స్థైర్యం వీడని ఈ సాహసనారి హర్షల.. ముంబయి శివసేన నాయకుడు రఘునాథ్ మోరే కుమార్తె.