: సచిన్ కు జోడీపై 'ముంబయి' మల్లగుల్లాలు
'మాస్టర్ ఆఫ్ బ్యాటింగ్ ఆర్ట్' సచిన్ టెండూల్కర్ కు ఓపెనింగ్ పార్ట్ నర్ గా ఎవరిని బరిలో దింపాలన్న విషయమై ముంబయి ఇండియన్స్ వ్యూహకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. ముంబయి జట్టు నేడు బెంగళూరులో తమ తొలి మ్యాచ్ లో పటిష్టమైన రాయల్ చాలెంజర్స్ తో తలపడనుంది. ఈ రసవత్తర పోరులో సచిన్ జోడీ ఎవరన్నది పిచ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాతే నిర్ణయిస్తామని ముంబయి ఇండియన్స్ సారథి రికీ పాంటింగ్ అంటున్నాడు.
కాగా, మరో ఓపెనింగ్ స్థానం కోసం ఆసీస్ ఆటగాళ్ళు బ్లిజార్డ్, ఫిల్ హ్యూస్ లతో పాటు భారత ఆటగాడు దినేశ్ కార్తీక్ కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కు కీలక బౌలర్ లసిత్ మలింగ దూరం కావడం పట్ల పాంటింగ్ విచారం వ్యక్తం చేశాడు. మలింగ గైర్హాజరీ నిరాశకు గురిచేస్తోందని చెప్పాడు. మలింగ స్థానంలో ఎవరిని తీసుకోనున్నారన్న ప్రశ్నకు జవాబిస్తూ, తుది జట్టును ఇంకా ఖరారు చేయలేదని తెలిపాడు.