భారత పారిశ్రామిక వేత్తల సంఘం (సీఐఐ) రెండోరోజు సదస్సులో
ఈ ఉదయం ప్రత్యేకంగా ప్రసంగించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పై బీజేపీ తనదైన వ్యాఖ్యలు చేసింది. సదస్సులో ఆయన చేసిన ప్రసంగమంతా రాహుల్ ను 'అయోమయ నేత'గానే చూపుతోందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. అంటే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన నరేంద్రమోడీ భయం రాహుల్ లో ఉన్నట్లు స్పష్టంగా కనబడుతోందన్నారు.
తొమ్మిది సంవత్సరాల పాలనలో ప్రభుత్వ (యూపీఏ) అవినీతీ, ద్రవ్యోల్భణంపై రాహుల్ ప్రస్తావించక పోవడం విచారకరమన్నారు. ఎవరూ అర్ధం చేసుకోలేని అయోమయ సిద్ధాంతాలను ఒక అయోమయ నేత తన ఉపన్యాసంలో చెప్పారని జవదేకర్ వ్యాఖ్యానించారు. ఒక గ్రామస్థాయి నేత మాట్లాడినట్లుగా ఆయన ఉపన్యాసం ఉందన్నారు. ఇదంతా చూస్తుంటే రాహుల్ లో 'మోడీ ఫోబియా' ఉందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. కాగా, రాహుల్ చెబుతున్న సిద్ధాంతాలను ఇంతవరకు కాంగ్రెస్ అమలుచేయకపోవడం ఆశ్చర్యపరిచే విషయమని మరో అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు.