: ప్యాకేజీపై నిర్ణయం నేడే... ఢిల్లీలో ఆర్థిక శాఖ సమావేశం
రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. అపాయింటెడ్ డే దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీగా, ఎంతేసి నిధులు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రణాళికా సంఘం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రానికి చెందిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ నిన్ననే ఢిల్లీ వెళ్లారు.
రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు ఏయే రంగాల్లో ఏయే రాష్ట్రానికి ఎంతచొప్పున పన్ను రాయితీ ఇవ్వాలి?, రెండు రాష్ట్రాలకు అదనపు సాయంగా కేంద్రం ఎంత చొప్పున నిధులు కేటాయించాలి?, ప్రణాళికా సంఘం ద్వారా ఇవ్వాల్సిన నిధులు ఎంత?, వివిధ కేంద్రమంత్రిత్వ శాఖల ద్వారా చేయాల్సిన ఆర్థిక సహాయం ఎంత? అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిధులు పంపకాలు ఖరారు చేయనున్నారని సమాచారం.