: ఆస్తులు, అప్పుల వివరాలు తెలపాల్సిందే... దాస్తే గెలిచినా వేటే: సుప్రీంకోర్టు


ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి సమాచారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2004లో మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిషన్ శంకర్ రాథోడ్ తన విద్యుత్ బిల్లుల బకాయిలు, తన భార్య పేరిట ఉన్న ఆస్తులు, ఆయన భాగస్వామిగా ఉన్న ఒక సంస్థ ఆస్తుల వివరాలు అఫిడవిట్‌లో పేర్కొనలేని, సరిగా పరిశీలించకుండానే రిటర్నింగ్ అధికారి ఆయన దరఖాస్తును స్వీకరించారని... కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని అదే నియోజకవర్గానికి చెందిన అరుణ్ దత్తాత్రేయ సావంత్, మరికొందరు పౌరులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

అయితే, దీనిపై కిషన్ శంకర్ సుప్రీంకోర్టు లో పిటిషన్ వేశారు. విద్యుత్ బకాయిల వివరాలు చెప్పకపోవడం పెద్ద అపరాధం కాదని.. కానీ, కిషన్ శంకర్ తన భాగస్వామికి సొంత ఇల్లు, వాహనం ఉన్న విషయం, తనకు ఓ సంస్థలో భాగస్వామ్యం ఉన్న విషయం చెప్పకపోవడం అసలైన అపరాధం అని పేర్కొంటూ, సుప్రీం తీర్పునిచ్చింది. అభ్యర్థులు తమతోపాటు, తమ జీవిత భాగస్వామి, తమపై ఆధారపడిన పిల్లల పేరిట ఉన్న ఆస్తులు-అప్పులు, నేరచరిత్ర, తమ విద్యార్హతల వివరాలు నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో తప్పక సమర్పించాల్సిందేనని, అలా తెలపకపోతే ఎన్నికైన తర్వాతైనా అనర్హత వేటుకు గురవుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

భారత రాజ్యాంగంలోని 19 (1)(ఎ) అధికరణం ప్రకారం భారత పౌరులకు ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల పూర్తి వివరాలు తెలుసుకునే ప్రాథమిక హక్కు ఉందని వివరించింది. అలా ఇవ్వకుండా వివరాలను దాచిపెట్టినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, ఖాళీగా వదిలినా.. రిటర్నింగ్ అధికారి ఆ అభ్యర్థి దరఖాస్తు పరిశీలన దశలోనే తిరస్కరించవచ్చని స్పష్టం చేసింది. ఒకవేళ అప్పుడు తెలియకుండా తర్వాత ఆ విషయం తేలినా సదరు అభ్యర్థి అనర్హుడవుతాడని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News