: నన్ను బ్రోకర్ అంటావా? నీ గత చరిత్ర ఏమిటో గుర్తుకు తెచ్చుకో, కేసీఆర్!: పొన్నాల


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల మధ్య మాటల యుద్ధం శృతి మించుతోంది. నిన్న తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు పొన్నాల కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలు బయటపెడుతుంటే... అభద్రతా భావంతో, అహంకారంతో కేసీఆర్ తనపై విమర్శలు గుప్పిస్తున్నాడని పొన్నాల విమర్శించారు. తన పనిని చూసి ఓర్వలేకే కేసీఆర్ తనపై విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని చీలుస్తానని తానెప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. "నన్ను బ్రోకర్ అంటావా? నీ గత చరిత్ర ఏంటో మర్చిపోవద్దు. గుర్తుకు తెచ్చుకో, కేసీఆర్" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలకు సమాధానాలు చెప్పలేకే కేసీఆర్ తనపై దాడి మొదలు పెట్టాడని తెలిపారు. కేసీఆర్ ఎప్పుడు ఏమి మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ నేతలెవరితోనూ తాను మాట్లాడలేదని... అందువల్ల కేసీఆర్ కు సంజాయషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని పొన్నాల చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలన్నీ ఆయనకే వర్తిస్తాయని అన్నారు. తమ పార్టీ నేతలు చేజారుతారనే భయంతోనే కేసీఆర్ ఈ నెల 17న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని వారికి టికెట్లు ఇచ్చి... వారు పార్టీని వీడుతారేమోనని ఇప్పుడు భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంచితే, అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని పొన్నాల కోరారు. ఎన్నికల కోడ్ తో సంబంధం లేకుండా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News