: ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్లకు 18 లక్షల జరిమానా
వైద్యోనారాయణా హరీ! అని వైద్యులను శ్లాఘించారు పెద్దలు. అలాంటి వైద్యులు నిర్లక్ష్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సినిమాల్లో హాస్యం కోసం వైద్యులు ఆపరేషన్ చేసిన తరువాత రోగుల కడుపుల్లో కత్తులు, కత్తెర్లు మర్చిపోయినట్టు సన్నివేశాలు సృష్టిస్తారు దర్శకులు. అవి నవ్వుకునేందుకు బాగుంటాయి కానీ, అలాంటివి నిజజీవితంలో జరిగితే ఆ రోగి బాధ వర్ణనాతీతం.
ఢిల్లీలో ఓ మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తే... ఆపరేషన్ చేసిన వైద్యులు బిడ్డను బయటకు తీసి, రక్తాన్ని క్లీన్ చేసిన స్పాంజ్ను కడుపులోనే ఉంచేసి ఆపరేషన్ పూర్తి చేశారు. దీంతో ఆమె ప్రాణాలు పోయినంత పనైంది. ఢిల్లీలోని కైలాష్ నగర్కు చెందిన శ్వేతా ఖండేల్వాల్ ప్రసవం కోసం 2012 సెప్టెంబర్ 13న రిషబ్ మెడికల్ సెంటర్ లో జాయిన్ అయింది. శస్త్రచికిత్స చేసి ప్రసవం పూర్తి చేశారు అక్కడి డాక్టర్లు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన శ్వేతా ఖండేల్వాల్ తీవ్రమైన కడుపు నొప్పితో విలవిల్లాడిపోవడంతో... ఆమెను మళ్లీ అదే ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఎలాంటి సమస్య లేదని, నిక్షేపంగా ఉందని చెప్పి పంపేశారు. ఆమె ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తుండటంతో మరో ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఇన్ఫెక్షన్ కారణంగా కడుపులో చీము ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్ర చికిత్స చేసి అందుకు కారణమైన స్పాంజ్ ముక్కలను బయటకు తీశారు.
దీంతో డాక్టర్ల నిర్లక్ష్యంపై బాధితురాలు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. దాంతో ఆమెకు కలిగించిన నష్టానికిగానూ 18 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రిషబ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.కె.జైన్, డాక్టర్ ఉషా జైన్లను వినియోగదారుల ఫోరం ఆదేశించింది.