: ఐసీయూలో హత్యకు గురైన డాక్టర్
దిభ్రుగడ్ లోని అసోం వైద్య కళాశాల ఆసుపత్రి ఐసీయూలో డ్యూటీలో ఉన్న ఓ పీజీ విద్యార్థినిని వార్డు బాయ్ హత్య చేశాడు. శస్త్రచికిత్స చేసే కత్తితో సరితా తస్నివాల్ అనే వైద్యురాలి మెడ ఎడమ వైపున పొడిచి చంపాడు. ఐసీయూలోని వైద్యుల విశ్రాంతి గదిలో బెడ్ పై సరిత విగత జీవిగా పడి ఉండటాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు. నిందితుడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించి ఉండొచ్చని, ఆ క్రమంలో ఆమెను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సరితా తస్నివాల్ గురువారం రాత్రి పది గంటల నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు ఐసీయూలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం 5.30 గంటల తర్వాత విశ్రాంతి గదికి వెళ్లినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అసోం మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుంచే సరిత ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోర్సులో చేరారు. సహ వైద్యునితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలోనే ఆమెకు పెళ్లి జరగాల్సి ఉండగా... ఈలోపే దారుణం జరిగింది. ఈ ఘటనతో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. మహిళా వైద్యులకు రక్షణ కల్పించాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు.