: బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ సంస్థ నిర్వాహకుల తీరిది!


ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల వద్ద డబ్బు తీసుకొని మోసం చేయడం.. వచ్చిన డబ్బుతో విలాసవంతంగా జీవించడం ‘జీవిజ్ సిస్టమ్స్ ప్రై.లి' యజమానులకు అలవాటుగా మారింది. గతంలో మూడుసార్లు జైలుకు వెళ్లొచ్చినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు సరికదా, మరోసారి నిరుద్యోగులను మోసం చేసి జైలు పాలయ్యారు. పంజాగుట్ట పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... సైనిక్‌పురికి చెందిన టి.సత్యరమణమూర్తి (37), అమూల్య (32) దంపతులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేసేవారు.

జల్సాలకు అలవాటు పడిన వారిద్దరూ తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి మరింత విలాసవంతమైన జీవితం కోసం పాకులాడారు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ లో సోమాజిగూడలోని గుల్‌మొహర్ ఎవెన్యూ అపార్ట్‌మెంట్‌లో ‘జీవిజ్ సిస్టమ్స్ ప్రై.లి.' పేరిట సాఫ్ట్‌వేర్ సంస్థను నెలకొల్పారు. కొన్ని కంప్యూటర్లు అద్దెకు తీసుకొని కార్యాలయంలో పెట్టారు.

ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ పట్టభద్రులకు స్టాఫ్ట్‌వేర్‌లో శిక్షణ ఇచ్చి.. ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తామని పకడ్బందీగా ప్రచారం చేశారు. కొన్ని కన్సల్టెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకొని.. సుమారు 50 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వల విసిరారు. ఒక్కొక్కరి వద్ద రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకూ మొత్తం రూ. 40 లక్షలు వసూలు చేశారు. రెండు నెలల పాటు శిక్షణ ఇప్పించడంతో పాటు కొంత మొత్తం స్టైఫండ్‌ రూపంలో చెల్లించారు. రెండు నెలల తరువాత వారికి శిక్షణ తరగతులు నిర్వహించలేదు.

ఉద్యోగం ఆశతో చేరిన వారు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని జీవిజ్ సిస్టమ్స్ సంస్థపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రేపు, మాపు అంటూ నిరుద్యోగులను తిప్పించుకుంటుండడంతో, బాధితులు నిర్వాహకులను గట్టిగా నిలదీసేవారు. దీంతో తమ వద్ద రిసెప్షనిస్టుగా పని చేస్తున్న ఆర్షియా బేగంతో వారిపై కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసేవారు. వారి వేధింపులు తాళలేని బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు సత్యరమణమూర్తి, అమూల్యలతో పాటు రిసెప్షనిస్టు ఆర్షియా బేగంను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో పలు విషయాలు వెలుగు చూడడంతో పోలీసులు నివ్వెరపోయారు. గతంలో వీరు వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థలు నెలకొల్పి నిరుద్యోగులను మోసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. వీరిపై పంజాగుట్ట, బేగంపేట, సీసీఎస్ ఠాణాల్లో కేసులు ఉన్నాయని, బేగంపేట్ పోలీసులు గతంలో వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు కూడా పంపారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News