: కొనసాగుతోన్న అల్పప్రీడన ద్రోణి... రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
అరేబియా సముద్రంలో కేరళ తీరంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో 48 గంటల వరకు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖాధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావం రాయలసీమ జిల్లాలపై ఉంటుందని వారు తెలిపారు. తెలంగాణలో క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గనున్నాయి.
ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాదులో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోనీలో భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి మార్కెట్లలో వర్షానికి ధాన్యం తడిసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తణుకు, ఉండ్రాజవరం, భీమవరం, ఉండి, పాలకోడేరు, పాలకొల్లులో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మిడివరం, ఉప్పలగుప్తంలో, నల్లగొండ జిల్లా శాలిగౌరారం, నకిరేకల్లులో వర్షం పడుతోంది.