: 120 అసెంబ్లీ...22 లోక్ సభ స్థానాలు మావే: చంద్రబాబు
సీమాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 120 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 20 నుంచి 22 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. వేవ్ బాగుంటే ఈ సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కొంత మంది భ్రమల్లో బతుకుతున్నారని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతుంటే ప్రతిఘటించే స్థితిలో మీడియా లేకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.
విషపూరితమైన మద్యం ఏరులై పారుతుంటే ఎందుకు కట్టడి చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆయన సూచించారు. ఒక్కో వ్యక్తికి ఒక్కోలా న్యాయం అమలు చేయడం సరికాదని ఆయన అన్నారు. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.