: కన్నీరు పెట్టుకున్న వెంకటరమణ... ఇదేం పని భూమన...!
తిరుపతిలోని గురుకృప పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేత వెంకటరమణను వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి కొట్టారు. గత నెల రోజులుగా ప్రచారంలో నీరసించిపోయి, ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ అలసిపోయిన వెంకటరమణ కింద పడిపోయారు. ఆయనకు ఏమైందోనని ఆందోళన చెందిన పోలింగ్ అధికారులు ఆయనను పైకి లేపి, నీరు తాగించారు.
షుగర్ పేషంట్ అయిన వెంకటరమణ తేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఎస్పీ రావాలని, న్యాయం చేయాలని వెంకటరమణ డిమాండ్ చేశారు. దాంతో ఎస్పీ అక్కడికి ఎస్సైని పంపించారు. ఆయన వెంకరమణను, కరుణాకర్ రెడ్డిని ఒకే జీపులో ఎక్కించి తీసుకెళ్లారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం పోలింగ్ ముగిసిపోతుందనగా సుమారు రెండు వందల మంది కడపకు చెందిన వ్యక్తులతో భూమన కరుణాకర్ రెడ్డి రిగ్గింగ్ కోసం గురుకృప పాఠశాలకు చేరుకున్నాడు.
దీనిని గమనించిన టీడీపీ నేతలు వెంకటరమణకు సమాచారం అందించారు. దీంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వెంకటరమణ 'ఇదేం పని భూమన... సత్తా ఉంటే గెలిచేవాడివి కదా?' అన్నారు. దీంతో భూమన 'నువ్వు నాకు చెప్పేదేంటి' అంటూ రెండు చెంపలపై చాచి కొట్టారు. దీంతో ఇద్దరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వీరిద్దరి మధ్య రాజీకి పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.