: సీమాంధ్రలో ముగిసిన పోలింగ్
సీమాంధ్రలో ఉన్న 13 జిల్లాల్లోని 175 శాసనసభ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియకు తెరపడింది. 6 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఉంటుంది. అంతకు ముందు... మావోయిస్టు ప్రాబల్యం ఉన్న విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించిన విజయనగరం జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, గుంటూరు జిల్లాలోని మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది.ఈ ఎన్నికల్లో సీమాంధ్ర నుంచి శాసనసభకు 2241 మంది అభ్యర్థులు, లోక్ సభకు 333 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 16న కౌంటింగ్ జరుగుతుంది.
ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభం అయినప్పటినుంచి పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. కొంతమంది రాజకీయ నాయకుల వాహనాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ, వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఏఎస్పీ అప్పలనాయుడిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. చిత్తూరు జిల్లా నడవలూరులో మీడియా ప్రతినిధులపై కూడా దాడులు జరిగాయి. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పలకజీడిలో మావోయిస్టులు రెండు ఈవీఎంలను, పోలీసు జీపును దగ్ధం చేశారు.