: చిన్నారులు కూడా ఇక నుంచి బ్యాంకు ఎకౌంట్ ను ఆపరేట్ చేయొచ్చు!
చిన్నారులు కూడా ఇక నుంచి సొంతంగా బ్యాంకు ఖాతాను నిర్వహించుకోవచ్చు. పదేళ్లు నిండిన పిల్లలు బ్యాంకు ఖాతాలు తెరచేందుకు, ఆపరేట్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అవకాశం కల్పించింది. అలాగే వారు తమ ఎకౌంట్ కు అనుబంధంగా ఏటీఎం కార్డులు, చెక్ బుక్ లు కూడా తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ జారీ చేసింది.
ఇప్పటివరకు తల్లి సంరక్షకురాలిగా ఉంటూ బ్యాంకు ఖాతా తెరచేందుకు మాత్రమే అనుమతించేవారు. కానీ, ఇక నుంచి చట్టపరమైన సంరక్షకుని పర్యవేక్షణలో సొంతంగా రికరింగ్ డిపాజిట్, ఫిక్స్ డ్ డిపాజిట్, పొదుపు ఖాతాలను తెరచి సొంతంగానే నిర్వహించేందుకు అవకాశం ఉంది. అయితే కస్టమర్ వయసును బట్టి ఎంత మొత్తంలో లావాదేవీలు నిర్వహించవచ్చునన్న పరిమితిని మాత్రం బ్యాంక్ నిర్ణయిస్తుంది.
మైనర్ ఖాతాలకు డెబిట్ కార్డులు, చెక్ బుక్ జారీ చేయవచ్చునని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా కల్పించవచ్చునని బ్యాంకులకు ఆర్‌బిఐ సూచించింది. ఇప్పటికే నిర్వహిస్తున్న మైనర్ ఖాతాలను కూడా అప్ గ్రేడ్ చేసి సంబంధిత బాలబాలికల నమూనా సంతకాలు తీసుకుని వారికి ఖాతా నిర్వహణకు స్వేచ్ఛనివ్వాలని కూడా రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.