: సీమాంధ్రలో ప్రారంభమైన పోలింగ్
సీమాంధ్రలోని 175 శాసనసభ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఇక విజయనగరం జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, గుంటూరు జిల్లాలోని మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ నియోజక వర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 175 శాసనసభ స్థానాలకు 2241 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా... 25 లోక్ సభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 40,708 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 3,67,62,975 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 23,184 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ టెలికాస్టింగ్ ఏర్పాటు చేశారు. 1.20 లక్షల మంది పోలీసులను భద్రతకు వినియోగిస్తున్నారు. వీరితో పాటు ఎన్నికల విధుల్లో 272 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి.