: సీమాంద్రలో రేపు సెలవు ఇవ్వాల్సిందే: భన్వర్ లాల్
సీమాంధ్రలో రేపు (బుదవారం) పోలింగ్ సందర్భంగా సెలవు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ అన్నారు. చిన్న దుకాణం నుంచి పెద్ద ఫ్యాక్టరీ వరకు ఎవరైనా బుధవారం తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని ఆయన చెప్పారు. ఉద్యోగులకు సెలవు ఇవ్వకుంటే సంస్థపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
హైదరాబాదులో ఇవాళ భన్వర్ లాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటర్ల జాబితాలో పేరుంటే ఓటు వేయవచ్చని చెప్పారు. ఎన్నికల సంఘం గుర్తించిన 11 డాక్యుమెంట్లలో ఏది ఉన్నా ఓటు వేయవచ్చునన్నారు. ఓటర్ల స్లిప్పులు లేకపోయినా ఓటు వేయవచ్చునని ఆయన తెలిపారు. ఓటర్లు స్లిప్ కోసం బూత్ లెవెల్ ఆఫీసర్ ను కలవాల్సిందిగా ఆయన సూచించారు.
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలిచ్చే మద్యం, నగదు వంటివి స్వీకరించకుండా... స్వచ్ఛందంగా ఓటు వేయాలన్నారు. డబ్బులు, మద్యం ఇచ్చేవారే కాదు... తీసుకున్నవారిదీ నేరమేనని ఆయన అన్నారు. అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.