: బంతులు రెండే...వికెట్లు మాత్రం మూడు... తంబే రికార్డు
రెండు బంతుల్లో మూడు వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడో భారత బౌలర్.
35-40 ఏళ్ల వయసు అంటే రాజకీయాల్లో యవ్వనం.. క్రీడల్లో రిటైర్మెంట్ వయసు. దిగ్గజ ఆటగాడిగా పేరు ప్రఖ్యాతులు, ఫిట్నెస్ కాపాడుకుంటే అతికష్టమ్మీద 40 వరకూ లాక్కురావచ్చు. అలాంటిది 43 ఏళ్ల వయసులో, జాతీయ స్థాయి క్రికెట్ కూడా ఆడని ఓ క్రికెటర్ అద్భుతాన్ని సాధించాడు.
హ్యాట్రిక్ అంటేనే క్రికెట్ లో ప్రత్యేకం. అలాంటిది రెండు బంతుల్లో హ్యాట్రిక్ అంటే అది అసాధ్యమే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రవీన్ తాంబే. ఈ ముంబైకర్ రిటైర్మెంట్ వయసులో ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-7లో భాగంగా నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తొలి బంతి గూగ్లీని వైడ్ గా వేశాడు. ముందుకి వచ్చి ఆడిన మనీష్ పాండే దాన్ని అంచనా వేయడంలో బోల్తా కొట్టాడు. దీంతో స్టంపౌట్ గా వెనుదిరిగాడు.
అలా బంతి వేయకుండానే తాంబే తొలి వికెట్ సాధించాడు. అనంతరం వేసిన మొదటి బంతికి యూసఫ్ పఠాన్ ను రిటర్న్ క్యాచ్ తో బలిగొన్నాడు. తరువాత వేసిన రెండో బంతిగా ఫ్లిప్పర్ వేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన ఫ్లిప్పర్ ను అంచనా వేయడంలో తికమకపడ్డ టెన్ డస్కౌటే వికెట్ల ముందు దొరికి పోయాడు. దీంతో రెండు బంతుల్లో హ్యాట్రిక్ తీసి.. టి-20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా ఘనత సాధించాడు.