: సీమాంధ్ర కన్నతల్లి, తెలంగాణ పెంచిన తల్లి: పవన్ కల్యాణ్
తనకు సీమాంధ్ర కన్నతల్లి అయితే, తెలంగాణ పెంచిన తల్లి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ, తనకు మంత్రినో ముఖ్యమంత్రినో అవ్వాలనే కోరిక లేదని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో తనను ఉద్యమంలోకి రమ్మని, పెద్ద పదవులు దొరుకుతాయని కొందరు ఆహ్వానించారని, అయినా తాను తిరస్కరించానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు మద్దతు పలికితే వారికి ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందని ఆయన అన్నారు.
జగన్ కు, తనకు వ్యక్తిగతమైన విరోధం లేదని ఆయన అన్నారు. కానీ జగన్ ముఖ్యమంత్రి కావడం వల్ల రాష్ట్రంలోని భూములు కొద్ది మంది గుత్తాధిపత్యంలోకి వెళ్తాయని... అందుకే ఆయనను వ్యతిరేకిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి కాకుండానే జగన్ ఇన్ని వేల కోట్లు దోచుకుంటే, మరి ముఖ్యమంత్రి అయితే ఇంకెంత దోచుకుంటారు? అని ఆయన ప్రశ్నించారు. అలాంటి పరిస్థితుల్లో సాయుధపోరాటాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు.
దేశ సంపద అంతా కబ్జాకోరుల చేతుల్లో ఉంటే ప్రజల సంగతి ఏమిటని పవన్ కల్యాణ్ అన్నారు. నాయకులు ఐదు తరాలు ముందుకు ఆలోచించి పథకాలు రచించాలని సూచించారు. డబ్బు సంపాదించి ఏం చేసుకుంటారని అన్నారు. వైఎస్ జగన్ కానీ, కోనేరు ప్రసాద్ కానీ అంత డబ్బు ఏం చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. మీరు సంపాదన పరులు కావడం అభ్యంతరం కాదు కానీ ప్రజల అస్తులను, ప్రజల హక్కులను హరించడం నేరమని అన్నారు.