: మాట్లాడాలంటే వందసార్లు... పని చేయాలంటే వేయిసార్లు ఆలోచిస్తా: పవన్ కల్యాణ్
ఏదన్నా మాట్లాడాలంటే వందసార్లు ఆలోచిస్తానని...ఓ పని చేయాలంటే వేయిసార్లు ఆలోచిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. చిత్తూరులో జరిగిన బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ, సీమాంధ్రులు అనవసరంగా తెలంగాణకు వచ్చారని, వారు వెళ్లిపోతే వారి ఇళ్లు, వారి ఉద్యోగాల్లో తెలంగాణ ప్రజలు స్థిరపడొచ్చని సాధారణ ప్రజలను కేసీఆర్ రెచ్చగొట్టాడని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల గత నాలుగేళ్లుగా ఎంత మధనపడ్డామో సీమాంధ్రులందరికీ తెలుసని ఆయన అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలు ఇంకా దరిద్రంగా తయారయ్యారని ఆయన అన్నారు.
కేసీఆర్ ను తిట్టాలంటే తనకు ఇబ్బందిగా ఉందని, అయినా నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అంటూ... అందుకే కేసీఆర్ ను తిట్టాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియక సినీ నటులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతుంటే రాజకీయ నాయకులు మాట్లాడాలి కదా? అలా ఎవరూ సమాధానం చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను మాట్లాడాల్సి వస్తోందని ఆయన చెప్పారు.