: 22 కోట్ల స్థలాన్ని కబ్జా చేసేందుకు విశ్వరూప్ విశ్వప్రయత్నం
మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ భూకబ్జాకు తెరతీశారని ఓ వృద్ధ దంపతులు ఆక్రోశం వెళ్లగక్కారు. అమలాపురంలోని భట్నవిల్లికి చెందిన కప్పగంతుల లక్ష్మీ నరసింహం, సోదెమ్మలకు కిమ్స్ ఆసుపత్రి ప్రక్కనే 5.43 ఎకరాల స్థలం ఉంది. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఈ స్థలం ఎకరానికి 4 కోట్ల రూపాయల పైచిలుకు ధర పలుకుతోంది. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో లక్ష్మీనరసింహం తన భార్య సోదెమ్మపేరిట ఆ స్థలాన్ని రాశారు. దానిని ఆమె తన సోదరి కుమారుడికి బదలాయించింది. దీనిపై బంధువులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం రేగింది.
వివాదం అప్పటి మంత్రి విశ్వరూప్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ స్థలం తనకు అప్పగించాలని ఆయన ఆ వృద్ధ దంపతులను బెదిరించారు. వారు దిగిరాకపోవడంతో కబ్జాచేసి కట్టడం నిర్మాణానికి పూనుకున్నారు. దీంతో ఆ వయసుమళ్లిన దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టేతో వివాదానికి తెరపడింది. అధికారం చేతిలో ఉండడంతో విశ్వరూప్ కబ్జాకు తెరతీశాడని ఆ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు.