: వేదికపై చంద్రబాబు... ఫ్లెక్సీలో పురంధేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నేత పురంధేశ్వరి ఒకే వేదికను పంచుకున్నారు. పీలేరులో చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన వేదికపై పురంధేశ్వరి ఫ్లెక్సీ ఉండడం అందర్నీ ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. పీలేరులో ఆయన మాట్లాడుతూ, నల్లారి వారి శకం ముగిసిందని అన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీకి ఓటేస్తే మునిగిపోయినట్టేనని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి కూడా ఏమీ చేయని అసమర్థుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆయన సోదరుడు మాత్రమే లాభపడ్డారని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘనత తనకు మాత్రమే దక్కుతుందని ఆయన తెలిపారు. సీమాంధ్రను కూడా అభివృద్ధి చేసుకోవాలంటే టీడీపీ-బీజేపీ కూటమికి ఓటేయాలని ఆయన సూచించారు.
చంద్రబాబు నాయుడు ప్రసంగించిన వేదికపై ఫ్లెక్సీలో పురంధేశ్వరి ఉండడంతో, బాబు ఏం చెబుతారా? అని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా తిలకించారు. తాను మత సామరస్యం కోసం పాటుపడితే, విజయమ్మ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.