: రజనీకాంత్ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరగనీయం: కస్తూరి కర్ణాటక జనపర వేదిక
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా 'లింగా'కు కర్ణాటకలో నిరసనలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరగనీయమంటూ కస్తూరి కర్ణాటక జనపర వేదిక సభ్యులు హెచ్చరిస్తున్నారు. తక్షణం సినిమా షూటింగ్ నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా రజనీకాంత్ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసి ధర్నాకు దిగారు. 2008లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నీటి వివాదం నడుస్తున్న సమయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తమిళులకు అనుకూలంగా మాట్లాడారు.
ఆ తరువాత రజనీకాంత్ కన్నడిగులకు క్షమాపణ కూడా చెప్పారు. జీవితంలో ఒక్కోసారి తప్పులు జరుగుతూ ఉంటాయని, ఇలాంటి తప్పు మరోసారి జరగదని రజనీకాంత్ హామీ ఇచ్చారు. కర్ణాటకలోని మండ్య, మెల్కోటే, కేఆర్‌ఎస్ ప్రాంతాల్లో ‘లింగా’ సినిమా షూటింగ్‌ను నిర్వహించాల్సి ఉంది. దీంతో రాష్ట్రానికి చెందిన కస్తూరి కర్ణాటక జనపర వేదిక సభ్యులు బెంగళూరులోని రాంనగర్లోని ఐజుమూరు సర్కిల్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్‌ను ఆపాలంటూ ధర్నాకు దిగి, దిష్టిబొమ్మను దగ్దం చేశారు.