: అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సీమాంద్రను తీర్చిదిద్దుతా: చంద్రబాబు
మన పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాదును అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పారు. కానీ, విభజన పేరుతో 60 శాతం మందిని కట్టుబట్టలతో ఏకపక్షంగా పంపించివేశారని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో బాబు మాట్లాడుతూ... తనది, మోడీది అభివృద్ధి జట్టు అని, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలది అవినీతి జట్టు అని అన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మారుస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సీమాంద్రను మారుస్తానని చంద్రబాబు చెప్పారు. సీమాంధ్రను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని మోడీ చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
తెలుగుదేశం అదికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 1500 నుంచి 2000 వరకు ఇస్తామని చంద్రబాబు అన్నారు. వికలాంగులకు రూ.1500 ఫించను చెల్లిస్తామన్నారు. ఇంటికొక ఉద్యోగం వచ్చేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ హెల్త్ కార్డు పేరుతో ప్రజలకు కార్పొరెట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యాన్ని అందించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్డుదారులు తమకు నచ్చిన ఆసుపత్రిలో రెండున్నర లక్షల వరకు వైద్యం చేయించుకోవచ్చని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులను రద్దు చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కాగానే తన రెండో సంతకం బెల్టు షాపుల ఫైలుమీదే చేస్తానని ఆయన సభాముఖంగా ప్రకటించారు.