: తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్న నరేంద్ర మోడీ
చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరుగుతున్న ఎన్డీయే బహిరంగ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అదినేత చంద్రబాబు ఒకే వేదికపై నుంచి ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘సోదరీ సోదరీమణులకు నమస్కారం’ అంటూ నరేంద్రమోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి, హిందీలో కొనసాగించారు. మోడీ ప్రసంగాన్ని వెంకయ్యనాయుడు తెలుగులోకి అనువదించారు.
రాయలసీమ పవిత్ర భూమి అని, సీమను అభివృద్ధి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతాన్ని రాసిన పవిత్ర ప్రాంతం మదనపల్లి అని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు. ఈ ఎన్నికలు సీమాంధ్ర ప్రాంతంలో కేవలం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం జరుగుతున్నవి కావని, స్వర్ణాంధ్రప్రదేశ్ తయారుచేసుకొనేందుకు జరుగుతున్న ఎన్నికలని మోడీ అన్నారు. దేశం, రాష్ట్రాన్ని లూటీ చేసే వారికి దయచేసి మద్దతు ఇవ్వవద్దని, ఎవరైతే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో... వారినే ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రలో టీడీపీ-బీజేపీ కూటమికి ఓటేస్తే స్వర్ణాంధ్రగా మారుస్తానని మాట ఇస్తున్నానని మోడీ చెప్పారు. సీమ ప్రజలకు సాగునీరిస్తే సిరులు పండిస్తారని, సీమాంధ్రను అభివృద్ధిపరచుకోవడం ప్రజల చేతిలోనే ఉందని ఆయన అన్నారు.