: ఓటు విలువ తెలుసుకోండి... తప్పనిసరిగా ఓటు వేయండి: భన్వర్ లాల్
రేపు (బుధవారం) తెలంగాణలో పోలింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రైవేటు సంస్థలు అవకాశం ఇవ్వాలని భన్వర్ లాల్ కోరారు. 24 గంటలూ పనిచేసే కర్మాగారాలు, కాల్ సెంటర్ యాజమాన్యాలు తప్పనిసరిగా ఒక షిఫ్ట్ లో సెలవు ప్రకటించాలని ఆయన చెప్పారు. ప్రైవేటు ఆఫీసులు, వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో జరిగే తొలి విడత పోలింగ్ కు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన ప్రజలకు సూచించారు. మెరుగైన పరిపాలన కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని భన్వర్ లాల్ చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా సరే చూపించి ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు, రేషన్ కార్డు వంటి 21 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దానిని రిటర్నింగ్ అధికారికి చూపించి ఓటు వేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.