: బైక్ లో పెట్రోల్, సెల్ లో టాక్ టైమ్ కావాలంటే ఓటేసి రండి!: మెదక్ వాసులకు బంపరాఫర్!


ఓటు వేస్తే 'అది చేస్తాం, ఇది చేస్తాం' అంటున్న రాజకీయ నేతలను ఇప్పటి వరకు చూశాం. మీ తలరాతనే మార్చేస్తామన్న హామీలు కురిపించిన నాయకులనూ చూశాం. కానీ, ఇప్పుడు సాక్షాత్తూ ప్రభుత్వ అధికారులే ప్రజలకు... సారీ ఓటర్లపై ఆఫర్ల జల్లు కురిపించారు. మీరు ఓటేసి, చేతి వేలిపై సిరా గుర్తును చూపిస్తే చాలు... పెట్రోలు పోయించుకునేటప్పుడు రాయితీలు, సెల్ ఫోన్ కు రీఛార్జి కూపన్లు... ఒకటేమిటి చివరకు నానో కారు కూడా ఇచ్చేస్తామంటున్నారు. అయితే, ఇవన్నీ మెదక్ జిల్లా వాసులకు మాత్రమే సుమా! వీటిలో చిన్న మెలిక ఉంది. చిన్న చిన్న బహుమతులు నేరుగా ఇచ్చేస్తారు. విలువైన బహుమతులను మాత్రం లక్కీ డిప్ తీసి విజేతను ఎంపిక చేసి అందజేస్తారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ నడుం బిగించారు. అందుకోసం జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం భారీ ప్రచారం కూడా చేసింది. జిల్లాలో గత ఎన్నికల్లో ఓటింగ్ తక్కువగా నమోదు కావడంతో ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలని కలెక్టర్ పట్టుదలగా ఉన్నారు. అందుకే ఓటర్లకు పలు రకాల ఆఫర్లు ప్రకటించారు. ఓటింగ్ లో పాల్గొంటే బైక్ లో పెట్రోల్, సెల్ రీఛార్జి చేసుకోవచ్చని ప్రజలను ఊరిస్తున్నారు. ఎక్కువ శాతం పోలింగ్ నమోదైన గ్రామానికి చెందిన ఓటర్లకు లక్కీ డిప్ ద్వారా ఓ నానో కారు, ఏసీ, రిఫ్రిజిరేటర్ లాంటి వస్తువులను కూడా గిఫ్ట్ గా ఇవ్వనున్నారు. మరింకెందుకు ఆలస్యం! మెదక్ జిల్లా వాసులూ... ఓటు వేసేందుకు సిద్ధం కండి!

  • Loading...

More Telugu News