: సమాధానాలు చెప్పరా?...ఎంత కాలం తిడతారు?: పవన్ కల్యాణ్
హరీష్ రావుకు బొత్సకు సంబంధాలు ఉన్నాయంటే తనను తిడుతున్నారని...ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో సూర్యదేవుని దేవాలయాలు లేవా? తెలంగాణలో నవగ్రహ దేవాలయాలే లేవా? అని ప్రశ్నించారు. మరి, అలాంటప్పుడు అరసవెల్లి వెళ్లి బొత్సతో బంధం కలుపుకునేంత అవసరం హరీష్ రావుకు ఏముందని ఆయన నిలదీశారు.
ఎన్నికల ప్రచారం పేరిట ప్రతి పార్టీని తిడుతూ ఉంటే తరువాత వారితో సత్సంబంధాలు ఎలా నెరుపుతారని ఆయన అడిగారు. మూడేళ్ల తరువాత విద్యుత్ ఇస్తామని కేసీఆర్ అంటున్నారని, అప్పటి వరకు విద్యుత్ సరఫరా చేయరా? చేస్తే ఎలా చేస్తారు? ప్రకటిస్తున్న పథకాలు ఎలా అమలు చేస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
తాను ఇప్పటికే చెప్పినట్టు బంగారు పళ్లానికైనా గోడచేరువు కావాలి అని అన్నారు. కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసే వారిని తిడుతూ... కేంద్రం నుంచి నిధులు ఎలా తెప్పించుకుంటారు? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ బాధ్యతగల నేతైతే అలాంటి వ్యాఖ్యలు చేయరని ఆయన హితవు పలికారు. పక్క రాష్ట్రాలతో గొడవలు పడితే సమస్యలు పెరుగుతాయి తప్ప పరిష్కారాలు దొరకవని ఆయన స్పష్టం చేశారు. కేంద్రాన్ని, మోడీని, సోనియాని విమర్శిస్తూ గొడవలు పెట్టుకుంటుంటే... ఎవరితో మంచిగా ఉంటారని ఆయన అన్నారు.
బీసీ నేతలపై తిట్ల దండకం వినిపిస్తున్న కేసీఆర్... బీసీ వ్యతిరేకి కాకుంటే ఏమవుతారు? అని పవన్ కల్యాణ్ నిలదీశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీకి తానంటే చాలా కోపమని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన తనను తిట్టినా పర్లేదని పవన్ అన్నారు. ఆంధ్రాభవన్ లో ఆంధ్రులపై మరోసారి దాడులు జరిగితే తన అసలు స్వరూపం చూస్తారని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తాను ప్రజల కోసం వచ్చానని... నిండు ప్రాణాలు బలవుతుంటే, న్యాయం జరగక పోతుంటే, బాధతో, అసహనంతో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు.
తనకు తెలుగుదేశం అంటే ప్రత్యేక ప్రేమ లేదని... పొత్తు ధర్మంలో భాగంలో మద్దతిస్తున్నానని పవన్ చెప్పారు. మోడీ ప్రధాని అయితే దేశాభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం కలిగిందని ఆయన అన్నారు. తనకు ఇంకా సినిమాలపై ఆసక్తి ఉందని, అంతకంటే దేశానికి సేవ చేయాలన్న తపన ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. బంగారు తెలంగాణ రావాలన్నా, బంగారు భవిష్యత్ కావాలన్నా బీజేపీ, టీడీపీ నేతలను గెలిపించాలని ఆయన కోరారు.