: మీ స్మార్ట్ ఫోన్ కేన్సర్ డాక్టరే
మీరు ప్రతినిత్యం వాడే మీ స్మార్ట్ ఫోన్ డాక్టర్ లా మీకు వచ్చే రోగాన్ని గుర్తించగలిగితే... వాహ్...! ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది కదా? మరో రెండేళ్లలో ఇది సాధ్యం కానుంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కేన్సర్ లక్షణాలను గుర్తించగలిగే స్మార్ట్ ఫోన్ రూపకల్పనకు పూనుకున్నారు. నగర జీవనంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నేటి తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు కేన్సర్.
క్యాన్సర్ ను నివారించేందుకు శాస్త్రవేత్తలు నిత్యం శ్రమిస్తున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ కు అనుసంధానం చేసే చిన్న పరికరాన్ని రూపొందించారు. దీనికి డిసీజ్ బ్రీతలైజర్ అని పేరుకూడా పెట్టారు. ప్రస్తుతానికి డెస్క్ టాప్ కు అనుసంధానించేలా రూపొందించిన ఈ పరికరాన్ని మరో రెండేళ్లలో స్మార్ట్ ఫోన్ కు అనుసంధానించేలా మారుస్తామని హామీ ఇస్తున్నారు. పెట్టుబడులు లేక తమ పని ఆలస్యమవుతోందని, పెట్టుబడులు సమకూరగానే తమ పని మరింత సులభమవుతుందని పరిశోధకుడు బిల్లీ బోయల్ తెలిపారు.
ఈ పరికరంలో ఒక వేలి గోరంత పరిమాణంలో ఉండే మైక్రోచిప్ ఉంటుందని, దీనికి రసాయనాలను గుర్తుపట్టే సామర్థ్యం ఉంటుందని ఆయన వెల్లడించారు. దీని వల్ల కేన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు ప్రాథమిక దశలోనే తెలిసిపోతాయని ఆయన చెప్పారు. దీంతో సరైన సమయంలో చికిత్స పొందడానికి వీలుంటుందని ఆయన తెలిపారు.