: రెండు లక్షలు తేలేదని...కొట్టి చంపేశారు
కట్నపిశాచి ఓ మహిళను బలి తీసుకుంది. అత్తింటి ఆరళ్లు భరించినా ఆమెను వారు బతకనివ్వలేదు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని భోపా పట్టణంలో అజ్మత్ అలీతో ఫత్మాకు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా ఆమెను పెళ్లి నాటి నుంచే భర్త, మరిది కట్నం కోసం వేధించేవారు. పుట్టింటి నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకురావాలంటూ గత కొంత కాలంగా ఆమెను వేధిస్తూ, దాడి చేస్తున్నారు. గత రాత్రి డబ్బు తీసుకురాలేదంటూ ఫత్మా భర్త, మరిది తీవ్రంగా కొట్టి చంపేసి పరారయ్యారు. బాధితురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.