: మోడీని మించిన మొనగాడు లేదు: దల్బీర్ కౌర్
మన దేశంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కన్నా దమ్మున్న మొనగాడు లేడని సరబ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ అన్నారు. 49 ఏళ్ల సరబ్ జిత్ ను గత ఏప్రిల్ 26న లాహోర్ జైలులో తోటి ఖైదీలు చంపేసిన సంగతి తెలిసిందే. 1990లో స్నేహితుడితో కలసి మద్యం సేవించిన సరబ్ జిత్... మైకంలో బోర్డర్ దాటి పాకిస్తాన్ లో అడుగుపెట్టాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పాక్ ఆర్మీ... లాహోర్, ముల్తాన్ లలో జరిగిన బాంబు పేలుళ్లకు సరబ్ కారణమంటూ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో సరబ్ కు ఉరిశిక్ష పడింది. అయితే, 2009లో సరబ్ ఉరిశక్షను అక్కడి కోర్టు నిలిపివేసింది.
ఈ నేపథ్యంలో అమాయకుడైన తన సోదరుడి చావుకు కారణమైన పాక్ కు బుద్ధి చెప్పే సత్తా ఒక్క నరేంద్ర మోడీకే ఉందని సరబ్ సోదరి దల్బీర్ కౌర్ అంటున్నారు. చైనా, పాక్ లతో పాటు ఏ సరిహద్దు దేశానికైనా వెన్నులో చలి పుట్టించగల ఏకైక నేత మోడీ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె మోడీకి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2012లో పాక్ ఖైదీ సలీం చిస్తీని భారత్ విడుదల చేసినప్పుడు... పాక్ నుంచి సరబ్ ను విడిపించుకునే అవకాశం వచ్చిందని... అయితే చేతగాని మన్మోహన్ ప్రభుత్వం వల్ల ఆ అవకాశం పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న ఆమె 2005లో బీజేపీలో చేరారు.