: ఉద్యోగం పోయిందని బస్సును హైజాక్ చేశాడు!
నిధులు దుర్వినియోగం చేశాడని... ముక్కు పిండి వసూలు చేశారు. అంతటితో ఆగకుండా విధుల్లోకి తీసుకోలేదు... దీంతో ఆర్టీసీపై కసితో ఏకంగా ఆర్టీసీ బస్సునే హైజాక్ చేశాడో ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలోని రాజవొమ్మంగికి చెందిన సీహెచ్ వెంకన్న ఆర్టీసీలో డ్రైవర్ గా పని చేశాడు. పదోన్నతిపై ఆయనను అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు. అక్కడ ఆయన లక్ష రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ లక్షరూపాయలు కట్టేశాడు. అయినా అధికారులు ఆయనను విధుల్లోకి తీసుకోలేదు.
దీంతో మండిపడ్డ వెంకన్న గుర్తేడుకు వెళ్తేందుకు రాజమండ్రి గోకవరం బస్టాండ్ లో నిలిపి ఉన్న బస్సును హైజాక్ చేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో గోకవరం డిపో మేనేజర్ రంపచోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బస్సును ఆపి అతనిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బు కట్టినా ఉద్యోగం ఇవ్వలేదనే కోపంతోనే తాను బస్సును హైజాక్ చేశానని వెంకన్న అంగీకరించాడు.