: శోభానాగిరెడ్డి రాజకీయ ప్రస్థానం


చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన భూమా శోభానాగిరెడ్డి బలమైన ప్రజానేతగా కర్నూలు జిల్లా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈమె మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి చిన్న కుమార్తె. ఆమె భర్త నాగిరెడ్డి కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవారే. దీంతో అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కీలక నేతగా పేరు తెచ్చుకున్నారు. 1968 నవంబర్ 16న ఆళ్లగడ్డలోనే శోభ జన్మించారు. ఇంటర్ వరకు చదువుకున్నారు. 18 ఏళ్ల వయసులోనే భూమా నాగిరెడ్డిని 1986లో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం.

1996 వరకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి నంద్యాల పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. దాంతో శోభ ఆకస్మికంగా రాజకీయ ప్రవేశం చేశారు. ఆళ్లగడ్డ స్థానానికి 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో శోభానాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 27వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండడంతో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమె ప్రతిభను గుర్తించి పెద్దపీట వేశారు. దాంతో ఆర్టీసీ చైర్ పర్సన్ పదవి ఆమెను వరించింది. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలా రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

అయితే, 2009 నాటి ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో శోభ, నాగిరెడ్డి దంపతులు ఆ పార్టీలో చేరారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఆమె సేవలు అందించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో నిమజ్జనం కావడంతో, భూమా దంపతులు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1996 నుంచి వరుసగా ఆమె గెలుస్తూ వస్తూనే ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆళ్లగడ్డ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుత శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష ఉపనేతగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర రాజకీయ రంగంలోని కొద్ది మంది సమర్థులైన మహిళా నేతల్లో ఒకరైన శోభ మృతి చాలా మందిని కలచివేసింది.

  • Loading...

More Telugu News