: పరారీలో బీజేపీ నేత గిరిరాజ్ సింగ్
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ బీహార్ మాజీ మంత్రి, బీజేపీ నేత పరారీలో ఉన్నారు. నిన్న (బుధవారం) బొకారో కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయడంతో ఏ క్షణమైనా అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దాంతో, ఈ తెల్లవారు జామున ఐదు గంటలకు బీహార్, జార్ఖండ్ పోలీసు బృందం గిరిరాజ్ ఇంటికి వెళ్లగా అప్పటికే వెళ్లిపోయినట్లు సిటీ ఎస్పీ జయకాంత్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోసం వెతుకులాట మొదలుపెట్టారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీని వ్యతిరేకించేవారు పాకిస్థాన్ మద్దతుదారులని ఈ నెల 18న ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆ వెంటనే కేసు నమోదైంది. ప్రస్తుతం బీజేపీ టికెట్ పై నవాడా లోక్ సభకు గిరిరాజ్ పోటీ చేస్తున్నారు.