: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భూమా శోభానాగిరెడ్డి
వైఎస్సార్సీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆళ్లగడ్డ సమీపంలోని గూబగుండంమెట్ట వద్ద రోడ్డుపై ఉన్న వరికుప్పలను తప్పించబోయి ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న నంద్యాలలో జరిగిన వైఎస్సార్సీపీ జనభేరి సభల్లో పాల్గొన్న అనంతరం ఆళ్లగడ్డలోని తన నివాసానికి ఆమె తిరిగి వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాలలో ప్రాథమిక చికిత్స జరిపిన అనంతరం హైదరాబాదులోని కేర్ ఆసుపత్రికి తరలించారు. గుండె వైపు 7 పక్కటెముకలు విరిగిపోయినట్టు, మెదడులోని నరాలు తెగిపోయినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆమెతో పాటు ఇద్దరు గన్ మెన్లు, డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి.