: సీమాంధ్రలో 25 ఎంపీ స్థానాలకు... 333 మంది పోటీ: భన్వర్ లాల్


సీమాంధ్రలోని 25 లోక్ సభ స్థానాల్లో 333 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 175 శాసనసభ స్థానాలకు 2,243 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. రాష్ట్రంలో కర్నూలు అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

హైదరాబాదులో భన్వర్ లాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 111 కోట్ల నగదు పట్టుబడిందని చెప్పారు. ఇది దేశం మొత్తమ్మీద స్వాధీనం చేసుకున్న సొమ్ములో దాదాపు సగభాగమని ఆయన వెల్లడించారు.

తొలి దశ ఎన్నికల్లో ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తుందని భన్వర్ లాల్ అన్నారు. ఆ తర్వాత ఎవరూ ప్రచారం చేసేందుకు వీల్లేదని ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు సూచించారు. అలాగే పార్టీలు, అభ్యర్థులు గుర్తులపై ఓటరు స్లిప్పులను పంపిణీ చేయకూడదని ఆయన తెలిపారు. ఎన్నికల కోసం 7 హెలికాప్టర్లు, 2 ఎయిర్ అంబులెన్సులను వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News