: విద్యార్థుల కోసం దీక్ష చేసింది జగనన్న ఒక్కడే: షర్మిల


విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం జగనన్న ఒక్కడే వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత షర్మిల అన్నారు. కర్నూలు జిల్లా కల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రైతుల కోసం దీక్ష చేసింది కూడా జగనేనని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పదవిని సైతం వదులుకున్నాడన్నారు. జగనన్నకు మీ ముఖంలో చిరునవ్వు చూడటమే ముఖ్యమని ఆమె అన్నారు. అందుకే జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని షర్మిల అన్నారు.

రాజశేఖర్ రెడ్డి పాలనలో కరెంటు ఛార్జిని పెంచలేదని ఆమె గుర్తు చేశారు. అద్భుతంగా పాలన సాగించిందీ వైఎస్సారేనని ఆమె పునరుద్ఘాటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ పాలనలో అన్ని ధరలూ పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్ ఛార్జీల పేరుతో 32 వేల కోట్ల రూపాయలు ప్రజలపై వేశారని ఆమె చెప్పారు.

చంద్రబాబు హయాంలో ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని షర్మిల విమర్శించారు. గత ఐదేళ్లలో ఏనాడైనా బాబు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారా? అని ఆమె ప్రశ్నించారు. విప్ జారీ చేసి మరీ కిరణ్ సర్కారును చంద్రబాబు కాపాడారని ఆమె ఆరోపించారు. పదవీ కాంక్షతో ఆయన అన్నీ ఫ్రీగా ఇస్తానంటూ ప్రజల ముందుకొస్తున్నారని అన్నారు. ఇప్పుడు రుణమాఫీ అంటున్న చంద్రబాబు... గతంలో రైతులకు కనీసం వడ్డీ మాఫీ కూడా చేయలేదన్నారు.

  • Loading...

More Telugu News