: కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చింది: మోడీ
కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. 1100 మంది బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడిందని... తెలుగు జాతి మీద కాంగ్రెస్ కు ఎందుకింత కక్ష? అని ప్రశ్నించారు. సీమాంధ్ర, తెలంగాణలు రెండు నవజాత శిశువులనే భావన గల ప్రభుత్వం కేంద్రంలో రావాల్సిన అవసరం ఉందని మోడీ తెలిపారు. తెలుగు జాతి స్పూర్తికి కాంగ్రెస్ పార్టీ విఘాతం కలిగించిందని చెప్పారు. తెలుగు జాతి స్పూర్తిని కాపాడుకోవాలనే తపన పవన్ కల్యాణ్ లో కనిపించిందని... ఇలాంటి పవన్ లు తెలంగాణ, సీమాంధ్రల్లో వేలాదిగా ఉన్నారని అన్నారు.
సర్ధాల్ పటేల్ లేకుంటే హైదరాబాద్ మన దేశంలో భాగంగా ఉండేది కాదని చెప్పారు. అప్పుడు, హైదరాబాద్ రావాలంటే వీసా అవసరం ఉండేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్, ఇందిర పేర్లతో ఎన్నో పథకాలు ఉన్నాయని... కానీ, పీవీ నరసింహారావు పేరు మీద ఒక్క పథకం కూడా లేదని విమర్శించారు. దుష్ట పరిపాలన దేశానికి మంచిది కాదని... ఖరీదైన కంప్యూటర్ ఉన్నా దానికి వైరస్ వస్తే లాభమేంటని ప్రశ్నించారు.