: నోవార్టిస్ కు భంగపాటు.. తక్కువ ధరలకే కేన్సర్ ఔషధాలు


రక్త కేన్సర్ చికిత్సకు వినియోగించే ఔషధం గ్లివెక్ పై పేటెంట్ విషయంలో బహుళజాతి ఫార్మా కంపెనీ నోవార్టిస్ కు ఓటమి ఎదురైంది. దీంతో కేన్సర్ మందులు కొండెక్కకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు నిర్ణయం తోడ్పడనుంది. 

గ్లివెక్ ఔషధంపై నోవార్టిస్ కు చాలా దేశాలలో పేటెంట్ హక్కులున్నాయి. అలాగే దేశంలోనూ పేటెంట్ హక్కుల కోసం 2006 నుంచీ పోరాడుతోంది. కానీ, భారతీయ పేటెంట్ చట్టం ప్రకారం గ్లివెక్ ఔషధంపై నోవార్టిస్ కు పేటెంట్ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై నోవార్టిస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై వాదనలు గత డిసెంబర్ లోనే పూర్తవగా నేడు సుప్రీం తన తీర్పును వెలువరించింది.
 
భారతీయ పేటెంట్ చట్టంలోని సెక్షన్ 3డి ప్రకారం గ్లివెక్ ఔషధానికి పేటెంట్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేస్తూ నోవార్టిస్ పిటిషన్ ను కొట్టివేసింది. నిజమైన పరిశోధనా ఔషధాలకే పేటెంట్ హక్కులుంటాయని స్పష్టం చేసింది. నోవార్టిస్ పాత ఔషధానికే స్వల్ప మార్పులు చేసి కొత్త ఔషధ రూపంగా చెబుతూ పేటెంట్ హక్కులు కోరగా.. అది చెల్లుబాటు కాదని సుప్రీం పేర్కొంది.
 
వాస్తవానికి ఈ ఔషధం నెలకు సరిపడా డోసేజ్ ను నోవార్టిస్ లక్ష రూపాయలకు పైనే విక్రయిస్తుంటే.. భారతీయ పేటెంట్ కార్యాలయం నుంచి అనుమతి పొందిన దేశీ ఫార్మా కంపెనీలు జనరిక్ రూపంలో 7వేలకే అందిస్తున్నాయి. అత్యవసర ఔషధాల ధరలు ప్రజలకు అందుబాటులోనే ఉండాలని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. దీంతో ఇకపై పేటెంట్ పేరుతో బహుళజాతి ఫార్మా కంపెనీలు దొంగాటలకు చెల్లుబాటు కాకుండా సుప్రీం తీర్పు దోహదపడనుంది. 

  • Loading...

More Telugu News