: 'సైకిల్'కి గాలి తీసేసిన సీపీఐ నారాయణ


ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట నడుస్తున్నారు. ఈయన ప్రచారం కూడా వినూత్న రీతిలో సాగుతోంది. రోడ్డు పక్కనున్న చేపలు అమ్ముకుంటున్న ఆమె దగ్గర ఆగి... చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రేటు ఎంత? వంటి వివరాలన్నీ అడిగి మరీ తెలుసుకున్నారు. కాసేపటి తర్వాత ఓ బార్బర్ షాపులో దూరి ఓ వ్యక్తికి షేవింగ్ చేశారు.

అనంతరం ఓ సైకిలు షాపు దగ్గరకు వెళ్లి... అక్కడున్న సైకిలు గాలి తీసేశారు. ఎందుకలా చేశారు? అన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ... ఇక్కడ సైకిలుకి గాలి తీస్తే... రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి గాలి పోతుందని అన్నారు. ఓ వైపు తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూనే, మరోవైపు సమైక్య రాష్ట్రం కోసం... టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించారని ఆరోపించారు. అందువల్ల సైకిలుకి గాలి తీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా సరదాగా నవ్వుకున్నారు.

  • Loading...

More Telugu News