: 29న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు విశిష్ఠ పురస్కారం
నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ నెల 29న శృతిలయ ఆర్ట్స్ అకాడమీ 'దాసరి నారాయణరావు- శృతిలయ స్వర్ణ కంకణ పురస్కారం'తో రాజేంద్రప్రసాద్ ను సత్కరించనుంది. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు పేరిట శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. తొలి పురస్కారానికి 200 చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న రాజేంద్రప్రసాద్ ను... దర్శకులు రేలంగి నరసింహారావు అధ్యక్షతన గల కమిటీ ఎంపిక చేసింది.
ఈ నెల 29న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో నటుడు రాజేంద్రప్రసాద్ కు దాసరి నారాయణరావు ఈ పురస్కారాన్ని అందిస్తారని శృతిలయ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు ఆర్ఎన్ సింగ్, ప్రధాన కార్యదర్శి ఆమని ఒక ప్రకటనలో వెల్లడించారు. విశిష్ఠ అతిధులుగా తమ్మారెడ్డి భరద్వాజ, వీరశంకర్, ఎన్.శంకర్, శివనాగేశ్వరరావు, నీలకంఠ, అల్లాణి శ్రీధర్, జి.రాంప్రసాద్, వి.ఈశ్వర్ రెడ్డి, రేలంగి నరసింహారావు, బి.జయ, కైకాల సత్యనారాయణ, ఈశ్వర్ రావు, శివకృష్ణ, గౌతంరాజు, గుండు హనుమంతరావు, కొండవలస లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.